ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ బెట్టింగ్స్‌పై పోలీసుల నిఘా

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ బెట్టింగ్స్‌పై పోలీసుల నిఘా

ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతుంది. దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు మాంచి కిక్కు ఇచ్చే మ్యాచ్ ఇది. దీనికితోడు సౌత్ వర్సెస్ నార్త్ ఫీలింగ్ కూడా వచ్చేసింది. చెన్నై వర్సెస్ గుజరాత్ మధ్య టైటిల్ యుద్దానికి బెట్టింగ్ రాయుళ్లు సైతం రెడీ అయిపోయారు. ఇన్నాళ్లు జరిగిన మ్యాచ్ లు ఒక ఎత్తు.. ఫైనల్ మ్యాచ్ మరో లెవల్ అంటున్నారు అభిమానులు. ఫైనల్ మ్యాచ్ పై భారీ ఎత్తున బెట్టింగ్స్ జరగనున్నట్లు వార్తలు వస్తున్న క్రమంలో.. పోలీస్ నిఘా విభాగాలు కూడా అప్రమత్తం అయ్యాయి.

ఐపీఎల్ 2023 ప్రారంభం అయినప్పటి నుంచి దేశవ్యాప్తంగా కోట్ల రూపాయలను పోలీసులు సీజ్ చేశారు. పదుల సంఖ్యలో అరెస్ట్ చేయగా.. వందల సంఖ్యలో ఫోన్లు, వాహనాలు సీజ్ చేశారు. లీగ్ దశలోని మ్యాచుల్లోనే ఇలా ఉంటే.. ఫైనల్ మ్యాచ్ ఎలా ఉంటుందనే అనుమానం రాక మానదు. ఈ క్రమంలోనే ఆన్ లైన్ బెట్టింగ్స్ తోపాటు స్థానికంగా బెట్టింగ్స్ నిర్వహించే ముఠాలపై కన్నేశారు. అనుమానితులపై నిఘా పెట్టారు పోలీసులు. 

ఆన్ లైన్ వేదికగా ఇప్పటికే బెట్టింగ్ టిప్స్ అంటూ కోకొల్లలుగా ట్రెండ్ అవుతున్నాయి. చెన్నై టీం బలాబలాలు ఇవే.. గుజరాత్ బలం ఇదే అంటూ క్రికెట్ నిపుణుల అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు. ఇలాంటి ఆన్ లైన్ సైట్లపైనా నిఘా పెట్టారు ఆయా రాష్ట్రాల సైబర్ క్రైం పోలీసులు. ఫైనల్ మ్యాచ్ కోసం ఇప్పటికే చాలా ప్రాంతాల్లో.. బార్లు, పబ్స్ భారీ ఎత్తున ఆఫర్స్ ప్రకటించాయి. బిగ్ స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నాయి. అలాంటి చోట్ల బెట్టింగ్స్ జరిగే అవకాశం ఉందనే అనుమానంతో నిఘా పెంచారు పోలీసులు. నిర్వహకులకు వార్నింగ్ ఇస్తున్నారు. అంతే కాకుండా ఫాంహౌస్ ల్లోనూ బెట్టింగ్స్ జరిగే అవకాశం ఉండటంతో.. ఆయా ప్రాంతాలపైనా కన్నేశారు. 

మ్యాచ్ చూడండి.. ఎంజాయ్ చేయండి.. అల్లరి చేయండి.. ఆనందంగా షేర్ చేసుకోండి అంతేకానీ బెట్టింగ్స్ గిట్టింగ్స్ అంటే మాత్రం తాట తీస్తాం అంటున్నారు పోలీసులు.. సో.. క్రికెట్ అభిమానులు.. మ్యాచ్ చూశామా.. ఆనందించామా అన్నంత వరకే ఉండండి.. హద్దు దాటితే అసలుకే మోసం రావొచ్చు.. బీ కేర్ ఫుల్..